పద్మాసనం

పద్మాసన భంగిమ తామరపువ్వును పోలి ఉంటుంది. పద్మాసనం అనేది సంస్కృత పదం నుంచి వచ్చింది. పద్మ అంటే తామరపువ్వు అని, ఆసనా అంటే స్థితి అంటారు. పద్మాసనం… ఈ ఆసనంలో సాధకుడు పద్మంలా కనిపిస్తాడు. సాధకుడు మానసికంగా ఏ మాలిన్యాన్నీ అంటకుండా మడుగులోని పద్మంలా స్వచ్ఛంగా, స్నిగ్ధంగా, సౌరభ పూర్ణంగా విరాజమానమవుతాడు.పద్మాసనం చేయు పద్ధతి :

A) నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి.

B) తర్వాత చేతితో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి.

C) ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా ఉంచాలి. సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి.

D) వెన్నెముక నిటారుగా ఉంచాలి. రెండు చేతులను మోకాళ్లపై ఉంచి బొటనవేలితో చూపుడు వేలును తాకించి మిగిలిన వేళ్లను అలాగే నిటారుగా ఉంచాలి.
మెడను చక్కగా వుంచండి. మీ మనసును కేంద్రీకృతం చేయండి. పద్మాసనం అన్ని రకాల రుగ్మతలకు వినాశకారిగా పనిచేస్తుంది.ఉపయోగాలు :

మెదడుకు ప్రశాంతత, శరీరం తేలికవుతుంది. మోకాళ్లు, చీలమండలు విస్తరిస్తాయి. దిగువ శరీరంలోని వెన్ను చివరిభాగం, వెన్నెముక భాగం, పొత్తికడుపు వంటి మొదలైన భాగాల్లో చైతన్యాన్ని కలిగిస్తుంది.

“ఇదం పద్మాసన ప్రోక్తంసర్వవ్యాధి వినాశనం”
అంటే పద్మాసనం వలన సమస్త రోగాలు నాశనం అవుతాయి.

పద్మాసనంలో ప్రాణాయామం చేస్తే సాధకుడు ఆత్మ ప్రశాంతంగా వుంటుంది. ధ్యానం చేసేవారికి ఈ ఆసనం ఎంతో శ్రేష్టమైంది. పద్మాసనంలో కూర్చున్న సాధకుడి ఆంతర్యం కూడా ఆసన ప్రభావంతో ఒక ఉదాత్త వైఖరిలోకి వెళ్లిపోతుంది.జాగ్రత్తలు :
ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళల్లో నొప్పులు అధికమైనప్పుడు ఆసనాన్ని నిలిపివేయడం ఉత్తమం. చీలమండ గాయం, మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు చేయకూడదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva