యోగ అంటే ఏమిటి?

“యుజ్” అనే సంస్కృత ధాతువు నుండి “యోగ” అనే పదం ఉత్పన్నమైంది. మానవుని మానసిక శక్తులన్నింటిని ఏకాగ్రత సాధించడం యోగము. “యుజ్” అనగా “కలయిక”.

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల రూపం. యోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది.

 సింధు నాగరికత చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు. సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము లోని ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా అధునిక కాలంలో అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది

భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో  “యోగ దర్శనము” ఒకటి. ఈ యోగ దర్శనానికి ఆద్యుడు పతంజలి. యోగసూత్రాల ప్రకారం “యోగం అంటే చిత్త వృత్తి నిరోధం”. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను “పతంజలి అష్టాంగ యోగం’ అంటారు. దీనినే రాజయోగం అంటారు.

పతంజలి మహర్షి

భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో  “యోగ దర్శనము” ఒకటి. ఈ యోగ దర్శనానికి ఆద్యుడు పతంజలి.పతంజలి యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. పతంజలి  “యోగ సూత్రాలు” గ్రంథంతో బాటు పాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయికి కూడా భాష్యం రాసాడు. ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. భారత దేశంలో పుట్టిన యోగ బహుళ ప్రచారంలోకి వచ్చింది.

పతంజలిని ఆదిశేషుడి అంశగా భావిస్తారు.

క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నరు.

యోగ సూత్రములు

పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 196 సూత్రములున్నాయి;

నాలుగు పాదములుగా విభజింపబడినవి.అవి

1)సమాధి{51}

2)సాధన{55}

3)విభూతి{56}

4)కైవల్య{34}

1)సమాధి పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది.

2)సాధన పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి.3)విభూతి పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి.

4)కైవల్య పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.

పతంజలి అష్టాంగ యోగము

1)యమ 2) నియమ 3) ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7)ధ్యాన 8) సమాధి

1)యమము : అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము.

2)నియమము : శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.

3)ఆసనం: పతంజలి చెప్పిన “ఆసనం” అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే “స్థిర సుఖాసనం” అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్

4)ప్రాణాయామం: శరీర స్పందనలన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.

5)ప్రత్యాహారం : ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.

6)ధారణ: ధారణ అంటే బ్రహ్మమును హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి.

7)ధ్యానము : ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన స్థితి.

ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి.

8)సమాధి : నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన స్థితిలో ఏకము, శాశ్వతము ఐన నేను ఉన్నాను అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవి.

భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ అమూల్య యోగ గ్రంథాన్ని అందించిన మహర్షి పతంజలి.

పతంజలి మంత్రం:

యోగేన చిత్తస్య పదేన వాచాం

మలం శరీరస్య చ వైద్యకేన

యోపాకరోత్తం ప్రవరం మునీనాం

పతంజలిం ప్రాంజలిరానతోస్మి

అర్థం:

యోగ దర్శనం చేత మనస్సు యెుక్క మాలిన్యములు, వ్యాకరణ శాస్త్రముచేత వాక్కు యెుక్క మాలిన్యములను, వైద్య శాస్త్రముచేత శరీర మాలిన్యములను పోగొట్టునట్టి మునిశ్రేష్టుడైన పతంజలి మహర్షికి నమస్కరించుచున్నాను.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva